పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు.. రాష్ట్ర హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. బరియాతులో 8.86 ఎకరాల భూమి రికార్డులను తారుమారు చేసి, నకిలీ పత్రాలను ఉపయోగించి కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా సంపాదించారనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జనవరి 31న సోరెన్‌ను అరెస్టు చేసింది. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం సోరెన్ రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైల్లో ఉన్నారు.
కాగా, శుక్రవారం విచారణ సందర్భంగా ఇరు పక్షాల వాదనలు విన్న జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంగన్ ముఖోపాధ్యాయ.. హేమంత్ సోరెన్‌కు రూ. 50 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేశారు. ప్రాథమిక ఆధారాల పరంగా హేమంత్ సోరెన్ నేరానికి పాల్పడలేదని.., బెయిల్‌పై ఉన్నప్పుడు నేరం చేసే అవకాశాలు కూడా లేవని గుర్తిస్తున్నాం.., అందుకే ఆయనకు బెయిల్ ఇస్తున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.