జితేందర్ రెడ్డిని మల్కాజిగిరి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక్కడి నుంచి నాగర్ కర్నూలు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిని పోటీకి పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహ రచన చేసినా జితేందర్ రెడ్డి రాకతో ఆయనకు ఇక్కడి నుంచి పోటీకి పెడితే బీజేపీ ఓట్లను చీల్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నట్టు సమాచారం. 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి బీఆర్ ఎస్ పక్షాన పోటీ చేసి గెలుపొండడంతో పాటు ఆ పార్టీ పార్లమెంటరీ నేతగా వ్యవహరించారు జితేందర్ రెడ్డి. మల్కాజిగిరి నియోజకవర్గంలో జితేందర్ రెడ్డికి ఉన్న పాత పరిచయాలు నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి పోటీకి దిగి సునాయాసంగా విజయం సాదించ వచ్చన్న భావన కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు తెలుస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ డీకే అరుణకు ప్రకటించడంతో పార్టీ అధిష్టానంపై జితేందర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం , మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జితేందర్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం. తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే జితేందర్ రెడ్డి లోక్ సభ ఎన్నికలకు ముందే హస్తం కండువా కప్పుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ జితేందర్ రెడ్డి మాత్రం తాను ఇంకా బీజేపీలోనే ఉన్నానని అంటున్నారు.