Kachchatheevu: లంకకు ఇచ్చేసిన కచ్చతీవు ఇప్పుడెందుకు వార్తల్లోకి వచ్చిందంటే..?

0
15

తమిళనాడుకు అతి దగ్గర్లో.. శ్రీలంక, భారత్ కు మధ్యలో ఉన్న దీవి కచ్చతీవు. కచ్చతీవు దీవిపై లోక్‌సభ ఎన్నికల వేళ మళ్లీ రాజకీయం మొదలైంది. 50 ఏళ్లనాటి అంశాన్ని ప్రధాని మళ్లీ తెరపైకి తెచ్చి కాంగ్రెస్, డీఎంకేలను టార్గెట్‌ చేస్తున్నారు. మార్చి 31నాడు టైమ్స్ ఆఫ్ ఇండియా దినపత్రిలో ప్రచురితమైన కథనంతో ఈ ఇష్యూ మొదలైంది.

సమాచార హక్కు చట్టంద్వారా ఓ విషయం బయటపడిందనీ.. 1974లో భారత ప్రభుత్వం మెతకవైఖరి కారణంగానే కచ్చతీవు ద్వీపం శ్రీలంకకు వెళ్లిందని కథనంలో ఉంది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ.. ఈ వివాదం ఎలా మొదలైందో ప్రజలకు తెలియాలన్నారు. తమిళనాడుకు సమీపంలో ఈ కచ్చతీవు ద్వీపం ఉంది. 1974లో భారత్, శ్రీలంక మధ్య ఒప్పందం కుదిరింది. భారత తీరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న 1.9 చదరపు కిలోమీటర్ల భూమిపై క్లెయిమ్‌ను భారత్‌ వదులుకున్నట్లు పత్రాలు చూపిస్తున్నాయి. శ్రీలంకకు 1948లో స్వాతంత్య్రం వచ్చింది. ఆ తర్వాత కచ్చతీవు ద్వీపాన్ని తమదిగా చెప్పుకుంటూ వచ్చింది. తమ అనుమతి లేకుండా కచ్చతీవుపై భారత నౌకాదళం విన్యాసాలు చేయకూడదని సూచించింది. 1974లో నెహ్రూ అధికారికంగా ఈ ద్వీపాన్ని వదులుకున్నారు.

1974-76 మధ్య నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, శ్రీలంక నాటి అధ్యక్షురాలు సిరిమావో బండారునాయకే మధ్య కచ్చతీవు ద్వీపంపై చర్చలు జరిగాయి. సముద్ర సరిహద్దు ఒప్పందంపై వీరిద్దరు సంతకాలు చేయడంతో కచ్చతీవు శ్రీలంక అధీనంలోకి వెళ్లింది. తమిళనాడు ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించింది. అలా.. ఈ ఇష్యూను మోడీ ట్విట్టర్ లో పోస్ట్ చేసి హైలైట్ చేయడంతో రాజకీయ రచ్చ మొదలైంది. కచ్చతీవుపై తమను మోడీ ఇరుకున పెట్టడంతో కాంగ్రెస్‌ స్పందించింది. మోదీ ప్రభుత్వం బంగ్లాదేశ్‌తో ‘సరిహద్దులకు సంబంధించి’ ఒప్పందం చేసుకున్నట్లే 1974లో ‘స్నేహపూర్వక ఒప్పందం’ కింద కచ్చతీవు దీవిని అప్పగించారని ఖర్గే అన్నారు. తాము మొదటినుంచి వ్యతిరేకమేనంటూ డీఎంకే కాంట్రవర్సీకి దూరంగా జరిగి కాంగ్రెస్ ను ఒంటరి చేసింది. ఎన్నికల్లో బీజేపీకి ఈ వివాదం ఎంతవరకు ప్లస్ అవుతుందనేది చూడాలి.