DELHI : అరవింద్ కేజ్రీవాల్, కవితలకు మే 7 వరకు కస్టడీని పొడిగించిన ఢిల్లీ కోర్టు

0
15

ఢిల్లీ : మద్యం పాలసీతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్‌ఎస్ నాయకురాలు కె. కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ఫండ్ మేనేజర్ చన్‌ప్రీత్ సింగ్‌ల జ్యుడీషియల్ కస్టడీని మే 7 వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురినీ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరచగా.. ఈ కేసులో కేజ్రీవాల్, కవితలకు మరో 14 రోజుల పాటు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మే 7న ఇద్దరూ కోర్టు ఎదుట హాజరవ్వాలని రూస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. తన భార్య సునీతా కేజ్రీవాల్ సమక్షంలో ప్రతిరోజూ 15 నిమిషాలపాటు తన వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించిన ఒక రోజు తర్వాత జరిగిన ఈ విచారణలో అవసరమైన వైద్య చికిత్స అందించాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఏదైనా ప్రత్యేక సంప్రదింపులు అవసరమైతే, తీహార్ జైలు అధికారులు ఎండోక్రినాలజిస్ట్, డయాబెటాలజిస్ట్‌లతో కూడిన ఎయిమ్స్ డైరెక్టర్ ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు చూసుకోవాలని పేర్కొంది. సోమవారం సాయంత్రం రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడంతో ఎయిమ్స్ వైద్యుల సలహా మేరకు కేజ్రీవాల్‌కు తక్కువ మోతాదులో ఇన్సులిన్ అందించినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు.

కాగా, ఢిల్లీ మద్యం పాలసీలో అవకతవకల కారణంగా గత నెల ఈడీ అధికారులు కవిత, కేజ్రీవాల్‌ను వేర్వేరు రోజుల్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం ఇద్దరూ తిహార్ జైలులోనే ఉంటున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. మరోవైపు, 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నిధులను నిర్వహించిన ఆరోపణలతో చన్‌ప్రీత్ సింగ్‌ని ఈడీ అరెస్టు చేసింది.