ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన కవిత.. సుప్రీంకోర్టులో వేసిన రిట్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. ఈడీ సమన్లు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ఆమె ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో.. రిట్ పిటిషన్‌పై విచారణ అవసరం లేనందున వెనక్కి తీసుకుంటున్నామని కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వెల్లడించారు.
దీనికి జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం అనుమతించింది. తాము చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని చౌదరి తెలిపారు. ఈడీ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ.. గత ఏడాది మార్చి 14న సుప్రీంకోర్టులో కవిత ఈ పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు కవిత ద్వారా రూ. 100 కోట్ల ముడుపులు అందినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో ఆప్ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్ర పన్నారని పేర్కొంది. చెల్లించిన ముడుపులకు బదులుగా భారీ మొత్తంలో లబ్ధిపొందాలని ప్లాన్ వేశారని తెలిపింది.