TG Politics: చాలా మందిని పాతరేశాం.. పార్టీ మార్పులపై కేసీఆర్

0
25

తమ పార్టీ నేతలను కాంగ్రెస్‌, బీజేపీలో చేర్చుకోవడంపై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుక్కల్ని, నక్కల్ని గుంజుకుని మీరు ఆహా, ఓహో అనుకోవచ్చు. మా ఎమ్మెల్యేలను తీసుకోవడం చీప్ పాలిటిక్స్. రాజకీయాలు చేస్తూ పోతే ప్రజలు ఏం కావాలి? రాజకీయాలు చేయడానికి మేము రెడీ. చాలా మందిని పాతరేశాం’ అని అన్నారు.

నిన్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించిన సంగతి తెలిసిందే. కొత్తగా వచ్చే పంటకు కాంగ్రెస్ వాగ్దానం చేసినట్లుగా రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఏప్రిల్ 2న దీనిపై BRS నేతలు అధికారులకు మెమోరాండాలు ఇస్తారని చెప్పారు. ఏప్రిల్ 6న బోనస్ కోసం దీక్షలు చేస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వంపై యుద్ధం చేద్దాం. పాలన చేతకాకపోతే దిగిపోవాలని చెబుతాం. ఈ అసమర్థ ప్రభుత్వం మెడలు వంచి రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తాం’ అని స్పష్టం చేశారు.

ఎండిపోయిన పంటకు ఎకరానికి రూ.25వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. ‘రైతుల తరఫున మాట్లాడేవారు లేరనుకుంటున్నారా? మేమున్నాం. ప్రభుత్వం మెడలు వంచుతాం. లక్ష ఎకరాల్లో పంట పోయింది. ఈ మంత్రులు, సీఎం ఏం చేస్తున్నారు? ఎండిపోయిన పంటకు ఎకరాకు రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాల్సిందే. అప్పటి వరకు వేటాడుతాం. వెంటాడుతాం. ఎక్కడికక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తాం’ అని తేల్చిచెప్పారు.

అధికారంలోకి వచ్చి నాలుగో నెల గడుస్తున్నా రుణ మాఫీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. డిసెంబర్ 9 ఎప్పుడు పోయింది. సీఎం రేవంత్ ఎక్కడ పడుకున్నారు. జనాలకు ఇష్టమొచ్చిన సొల్లు పురాణాలు చెప్పి జస్ట్ 1.8శాతం ఓట్ల తేడాతో గట్టెక్కి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. మిమ్మల్ని నిద్రపోనివ్వం. తరిమి కొడతాం’ అని హెచ్చరించారు

మరో వైపు కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పర్యటన ఖరారైంది. కరీంనగర్ రూరల్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో నీరు లేక ఎండిపోయిన పంటలను కేసీఆర్ పరిశీలించనున్నారు. అనంతరం పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడనున్నారు.