పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: తెలంగాణలో చేరికల వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఇవాళ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఇదే సమయంలో ఖర్గే సమక్షంలో కేకే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌లో చేరిక నేపథ్యంలో కేకే తన ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించిన కేకే కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు అనే పేరుంది. ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేకేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం కేకేతో పాటు ఆమె కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ను వీడారు. విజయలక్ష్మి మే నెలలోనే కాంగ్రెస్ కండువా కప్పుకోగా కేకే మాత్రం ఇంకా పార్టీలో చేరలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో ఏఐసీసీ పెద్దల సమక్షంలో పార్టీ కండువా కప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ కేకే ఒక్కరే చేరుతారా? లేక ఇంకా ఎవరైనా చేరబోతున్నారా అనేది సస్పెన్స్ గా మారింది.
అలానే గత కొన్ని రోజులుగా తెలంగాణ మత్రి వర్గ విస్తరణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం ఇందుకు సంబంధించిన కసరత్తును దాదాపు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఖర్గేతో రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో మంత్రి వర్గ విస్తరణ, నూతన పీసీసీ చీఫ్, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఎల్లుండితో ఆషాడ మాసం మొదలు కాబోతున్నది. దీంతో రేపు ఒక్కరోజే అవకాశం ఉండటంతో ఈ అంశాలపై ఇవాళ తుది నిర్ణయం తీసుకుంటే రేపు ప్రమాణ స్వీకారం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మంత్రివర్గంలో చోటు, పీసీసీగా ఛాన్స్ కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నందున అధిష్టానం ఎవరికి యస్ చెప్పబోతున్నదని మరెవరికి నో చెప్పనున్నదనేది కాంగ్రెస్ పార్టీలో సస్పెన్స్ గా మారింది.