Lungi Ngidi Out: ఢిల్లీ క్యాపిటల్స్ కు బిగ్ షాక్.. ఎంగిడి ఔట్

0
23

వారం రోజుల్లో ఐపీఎల్-2024 ప్రారంభం కానుండగా ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ప్రకటన చేసింది. గాయం కారణంగా పదిహేడో ఎడిషన్‌ మొత్తానికి లుంగీ ఎంగిడి దూరం కానున్నట్లుగా వెల్లడించింది. ఎంగిడి స్థానంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్‌ ఆడతారని డీసీ ప్రకటించింది. 14 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 25 వికెట్లు తీసిన ఎంగిడి.. గాయం కారణంగా ఐపీఎల్- 2024 నుంచి వైదొలిగారు. రూ. 50లక్షల కనీస ధర చెల్లించి జేక్ ఫ్రేజర్‌ను డీసీ తీసుకుంది.

ఇటీవల జరిగిన ఐపీఎల్ వేలంలో తొలుత ఫ్రేజర్‌‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. కానీ వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్ అనంతరం ఫ్రేజర్ సామర్థ్యంపై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఓ అంచనాకు వచ్చాడు. 21 ఏళ్ల హార్డ్‌ హిట్టింగ్‌ బ్యాటర్‌ ఫ్రేజర్ విధ్వంసక బ్యాటర్. భారీ షాట్లను సునాయాసంగా ఆడగలడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 18 బంతుల్లో 41 పరుగులు చేశాడు.

అంతేగాక 29 బంతుల్లో సెంచరీ బాది వైట్ బాల్ క్రికెట్‌‌లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు సాధించాడు. మార్ష్ కప్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున ఆడిన ఫ్రేజర్ తస్మనియా జట్టుపై ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ రికార్డు ఏబీ డివిలియర్స్ (31 బంతులు) పేరిట ఉంది.