ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మరో రెండు రోజుల్లో టీడీపీలో చేరనున్నారు. ఇవాళ టీడీపీ నేతలు ఆయన్ను కలిశారు. పార్టీలోకి రావాలని చంద్రబాబు తనను ఆహ్వానించారని మాగుంట చెప్పారు. తన కుమారుడు ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేస్తారని తెలిపారు. ఇవాళ ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు మాగుంటతో సమావేశమై, పలు అంశాలపై చర్చించారు.
తనతోపాటు తన తనయుడు మాగుంట రాఘవ రెడ్డి సైతం టీడీపీలో చేరబోతున్నారని ప్రకటించారు మాగుంట శ్రీనివాసులు రెడ్డి. ఇప్పటికే తాను రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించినట్లు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయబోనని తన కుమారుడు రాఘవరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించాలని యోచిస్తున్నట్లు తెలిపారు.ఇటీవలే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడారు. అనివార్య కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు. రాజకీయంగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.
మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామాతో వైసీపీని వీడిన సిట్టింగ్ ఎంపీల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ ఆరుగురిలో 5మంది పార్లమెంట్ సభ్యులు ఉండగా.. ఒక రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు,నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు,రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు రాజీనామా చేశారు.