శివరాత్రి వచ్చిందంటే చాలా మంది భక్తులు ఒక్కపొద్దులు,ఉపవాసాలు.. జాగరణ చేస్తారు. అసలు శివరాత్రి రోజు జాగరణ ఎందుకు చేయాలి. శాస్త్రాలు, పురాణాలు ఏం చెబుతున్నాయి.పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది ఈ రోజే. పార్వతిని వివాహం చేసుకున్నది కూడా ఇదే రోజు. అందుకే శివనామస్మరణతో శివుడికి దగ్గరగా ఉంటే ఆయన కటాక్షం పొందవచ్చని వేద పురాణాలు చెప్తున్నాయి. శివరాత్రిని పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించి, శివభక్తులు మహా శివరాత్రి రోజున శివయ్యను స్మరించుకోవడం వల్ల తాము శాంతిని, ప్రశాంతతను పొందుతారట. ఈ పవిత్రమైన రోజున రాత్రి వేళ మనుషులలో సహజంగానే శక్తులు పెరుగుతాయి. పురాణాల ప్రకారం, మహా శివరాత్రి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో.. వారంతా పరమేశ్వరుడికి బిల్వపత్రాలతో పూజలు చేయాలి. ఇక రాత్రి సమయంలో జాగరణ ఉండటం వల్ల శివయ్య నరకం నుంచి రక్షిస్తాడు. మోక్షాన్ని ప్రసాదిస్తాడని చాలా మంది నమ్ముతారు. శివరాత్రి రోజు జాగరణ చేయడం వల్ల రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వల్ల శరీరంలో తేజస్సు వస్తుందని ధర్మశాస్త్రాలు వెల్లడిస్తున్నాయి
శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.
ఉపవాసానికి, జాగరణకు నియమాలు
శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేబుతుంది. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి.
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి.