TELANGANA POLITICS : కడియం శ్రీహరిపై మంద కృష్ణ మాదిగ ఫైర్..

0
29

హన్మకొండ : నైతిక విలువలు లేని రాజకీయం చేస్తున్న కడియం శ్రీహరి.., బలపరుస్తున్న కడియం కావ్యను రానున్న ఎన్నికల్లో ఓడించాలని వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లకు..,మాదిగ సామాజిక వర్గానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. హన్మకొండ ప్రెస్ క్లబ్‎లో ఏర్పాటు చెందిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలలో కారు గుర్తుపై గెలిచిన కడియం శ్రీహరి తన బిడ్డ ఎంపీ టికెట్ కోసం కండువా మార్చి కాంగ్రెస్లో చేరాడని.. నైతిక విలువ ఉంటే తమ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కడియం కావ్యకు ఎంపీ టికెట్ కేటాయిస్తే రాత్రికి రాత్రే రాజకీయ కండువాలు మార్చుకున్న శ్రీహరి గతంలో టీడీపీ నుండి బీఆర్ఎస్‎కు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‎లోకి మారాడని తెలిపారు.

మాదిగల వర్గీకరణ కోసం ఇప్పటివరకు తాను ఒక్కటే కండువాతో పోరాటం చేస్తున్నా అని అన్నారు. ఈ పోరాటంలో కలిసి వచ్చే పార్టీలకు మద్దతు పలికాను కాని నమ్మిన సిద్ధతం కోసం మెడలోని కండువాను మార్చలేదని పేర్కొన్నారు. తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనే లేదన్నారు. ఎన్నికల్లో మాదిగలకు దక్కాల్సిన స్థానాలు దక్కకుండా సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్ ఇస్తూ పార్టీలు మాదిగలకు అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన మాటలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని కోరారు. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న బీసీలకు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు దక్కలేదని.., ఎన్నికల్లో గెలిచిన తరువాత పదవులు దక్కలేదని అన్నారు. తొమ్మిది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెలుమ సామాజిక వర్గానికి పదవులు దక్కాయని మంద కృష్ణ మాదిగ అన్నారు.

నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డి సామాజిక వర్గానికే పెద్ద పీట వేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం బొంత పురుగును అయినా ముద్దాడుతా అన్నారని, అదే కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీ తో పొత్తు పెట్టుకున్నాడని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడి ఎందరో ఉద్యమానికి బలి అవుతుంటే మద్దతు తెలపని కడియం తెలంగాణ సాధన జరుగుతుంది అనే నమ్మకంతో బీఆర్ఎస్‎లో చేరాడన్నారు. చేరిన నాటినుండి ఎన్నో పదవులు అనుభవించాడని, ఎక్కడ అన్యాయం జరిగిందని పార్టీ మారాడో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ కష్టకాలంలో కూడా కడియం శ్రీహరి కూతురు కావ్యకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తే బీఆర్ఎస్ పార్టీకి నమ్మకద్రోహం చేసి రాత్రికి రాత్రే కండువా మార్చాడని మంద కృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు.