TS POLITICS : మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నీలం మధు నామినేషన్

0
16

మెదక్ : మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బుధవారం నీలం మధు ముదిరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంత్ రావు, ఆవుల రాజీ రెడ్డి, మదన్ రెడ్డి, మెదక్ డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, సుహాసినితో కలిసి మెదక్ పట్టణానికి చేరుకున్నారు. అనంతరం వారందరితో కలిసి సర్వ మత ప్రార్థనలు నిర్వహించి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం మెదక్ కలెక్టరేట్‎కు చేరుకుని జిల్లా ఎన్నికల అధికారి, మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‎కు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మైనంపల్లి హన్మంత్ రావు మాట్లాడుతూ మెదక్ ఎంపీగా నీలం మధు ముదిరాజ్ భారీ మెజార్టీతో గెలుస్తున్నాడని.. ధీమా వ్యక్తం చేశారు. మెదక్ పార్లమెంటు నుంచి ప్రాతినిధ్యం వహించిన మహానేత దివంగత ఇందిరాగాంధీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. గత 25 ఏళ్లుగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు.. ఈ ప్రాంతానికి ఒరగబెట్టింది ఏమీ లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు ఈ ప్రాంతాన్ని కేవలం ఆదాయ వనరుగా మాత్రమే మార్చుకుని ప్రజల సంపాదను కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. రెండు పార్టీల మోసాన్ని గ్రహించిన మెదక్ ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించి పునర్వైభవం తీసుకురావాలని ఫిక్స్ అయ్యారని తేల్చి చెప్పారు. ఇందుకు తర్కాణంగా రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్‎ను ఉదహరించారు మైనంపల్లి హన్మంత్ రావు.

అలానే మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్ధి నీలం మధు మాట్లాడుతూ.. సర్వ మతాలకు, వారి నమ్మకాలను గౌరవించే ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని.., భిన్నత్వంలో ఏకత్వానికి తర్కాణంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ప్రాతినిథ్యం వహించిన మెదక్ పార్లమెంటు స్థానం నుంచి బీసీ బిడ్డనైన తనకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందన్నారు. మెదక్ పార్లమెంటు ఓటర్లంతా పెద్ద మనసు చేసుకుని మీ ఇంటి బిడ్డనైన తనను గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైనంపల్లి హన్మంత్ రావు, సుహాసిని, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మాజీ చైర్మన్ సురేందర్ గౌడ్, బొజ్జ పవన్, రాగి అశోక్, తదితరులు పాల్గొన్నారు.