Union Government: ఉపాధి కూలీల వేతన రేటు పెంచిన కేంద్రం

0
27

ఎన్నికల వేళ పేదలకు మరో శుభవార్త చెప్పింది కేంద్రం. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కింద పనిచేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం భారీ బహుమతిని అందజేసింది. MNREGA వేతన రేటును 3 నుండి 10 శాతం పెంచింది. మార్చి 28 గురువారం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. MNREGA కార్మికులకు కొత్త వేతన రేట్లు ఏప్రిల్ 1, 2024 నుండి వర్తిస్తాయి.

నోటిఫికేషన్ ప్రకారం.. 2023-24తో పోలిస్తే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో 2024-25 వేతన రేటు కనీసం 3 శాతం పెరిగింది. అదే సమయంలో గోవాలో వేతనాలు ఎక్కువగా పెరిగాయి. ఇక్కడ MNREGA వేతనాలు 10.6 శాతం పెరిగాయి. పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల నుంచి నిధులు నిలిపివేయడంపై వివాదం నెలకొన్న తరుణంలో ప్రభుత్వం రేట్లను పెంచింది. MNREGA వేతనాల పెంపుదల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేసిన పెరుగుదలకు సమానంగా ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ కు ముందు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఎన్నికల కమిషన్ నుండి అనుమతి కోరినట్లు తెలుస్తోంది. కమిషన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే పెంచిన వేతనాలకు సంబంధించి మంత్రిత్వ శాఖ వెంటనే నోటిఫికేషన్ జారీ చేసింది. వేతన రేట్లను మార్చడం ఒక సాధారణ ప్రక్రియ అని.. ఈసీకి కేంద్రం తెలిపింది. MNREGA ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకాలలో ఒకటి. ఇందులో గుంతలు తవ్వడం నుండి కాలువలు తయారు చేయడం వరకు నైపుణ్యం లేని పనులు ఉన్నాయి.