ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ కావడంతో ఆమె ప్రారంభించిన బువ్వకుండ ప్రోగ్రామ్ నిలిచిపోయింది. కవిత అరెస్ట్ అయినప్పటికీ 15 రోజులపాటు ఆహారాన్ని అందించారు. అనూహ్యంగా ఆదివారంతో ఈ ఆహార పంపిణీని నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. తన పుట్టినరోజు సందర్బంగా 2018లో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కవిత.
ఎంతోమంది అన్నార్తులకు ఈ కార్యక్రమం ద్వారా మేలు జరుగుతుండటంతో తర్వాత బోధన్ వైద్య విధాన పరిషత్ జిల్లా ఆసుపత్రి, జిల్లాలోని ప్రధాన గ్రంథాలయ ప్రాంగణాల్లో ఉచితంగా ఆహార పంపిణీ కార్యక్రమాలను విస్తరించారు. ప్రతి రోజూ 700 మందికి ఆహారాన్ని అందించేవారు. ఎంతోమంది ఆకలి తీర్చిన ఈ బువ్వకుండ కార్యక్రమాన్ని తాజాగా నిలిపివేయడంపై ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు.
బెయిల్ కోసం ఆమె తరఫు న్యాయవాదులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మనీ లాండరింగ్ కేసులో బెయిల్ అంత ఈజీగా వచ్చే అవకాశం లేదు. దీంతో ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తారని తెలుస్తోంది.