రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం కృత్రిమ కరవుకు దారితీస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మీడియాతో చిట్ చాట్ చేశారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఉన్నప్పటికీ దాన్ని వాడుకోలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని చెప్పారు. మహిళా రిజర్వేషన్లపై అవసరమైతే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని కవిత తెలిపారు. జీవో 3 వల్ల ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్ల అమలుల్లో జరుగుతున్న అన్యాయంపై శుక్రవారం ధర్నాకు దిగుతామన్నారు.
తమ దీక్షకు ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వలేదని చెప్పారు. వీలైతే అనుమతి కోసం కోర్టుకు వెళ్తామని అన్నారు కవిత. తనకు జాగృతి అనే సంస్థ ఎప్పటి నుంచో ఉందని, పోరాటాలు ఇంకా ఉద్ధృతం చేస్తామని కవిత చెప్పారు. పార్టీ నిర్ణయాలను తాను ప్రభావితం చేయలేనని, పార్టీ నిర్ణయనికి అనుగుణంగానే నడుచుకోవాలని చెప్పారు. అరవింద్‌ను ఓడించాలన్న టార్గెట్ ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందని, రాష్ట్రంలో ఉద్యమ రోజులు గుర్తు వస్తున్నాయని చెప్పారు. రెండు జాతీయ పార్టీలు కలిసి ప్రాంతీయ పార్టీలను బొంద పెట్టే యత్నం చేస్తున్నాయని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ కేసు కేసే కాదని చెప్పుకొచ్చారు.
మోడీ ముందు తెలంగాణ ప్రయోజనాల గురించి సీఎం రేవంత్ ప్రస్తావించలేదని అన్నారు కవిత. మహిళలకు రాష్ట్రంలో అన్యాయం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వం అచేతనంగా మారుతోందని విమర్శించారు. ప్రధాన సామాజిక వర్గాలకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదని అన్నారు. సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న పరిణామాలు బాధాకరమని చెప్పారు. ప్రభుత్వం గురించి మాట్లాడితే అంతు చూస్తామని అంటున్నారని.. తమకు ప్రభుత్వాన్ని పడగొట్టే అవసరం లేదని చెప్పారు.