Mumbai: బీజింగ్‌ను మించిన ముంబై..! కోటీశ్వరులంతా ఉండేది ఇక్కడే

0
17

ఇండియాలో సంపద సృష్టికర్తలు, సంపన్నుల వార్తలు ఎప్పటికైనా ఆసక్తిగా ఉంటాయి. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో నివసిస్తున్న బిలియనీర్ల సంఖ్య ఇప్పుడు చైనా రాజధాని బీజింగ్ కంటే ఎక్కువగా ఉంది. నగరం తొలిసారిగా ఆసియా బిలియనీర్ రాజధానిగా అవతరించింది. హురున్ రీసెర్చ్ 2024 గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో ఈ విషయం వెల్లడైంది.

ముంబైలో 92 మంది బిలియనీర్లు ఉండగా, బీజింగ్‌లో వారి సంఖ్య 91గా ఉంది. ప్రపంచం గురించి చెప్పాలంటే.. చైనాలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 814 కాగా భారతదేశంలో మొత్తం బిలియనీర్లు 271 మంది ఉన్నారు. ఆసియాలోనే ముంబై మొదటి స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ నగరం మూడవ స్థానానికి చేరుకుంది. 119 మంది బిలియనీర్లతో న్యూయార్క్ మొదటి స్థానంలో ఉంది. న్యూయార్క్‌కు మొదటి ర్యాంక్‌ అనేది ఏడేళ్ల తర్వాత దొరకడం విశేషం.

97 మంది బిలియనీర్లతో లండన్ రెండో స్థానం దక్కించుకుంది. ఈ ఏడాది ముంబైలో 26 మంది బిలియనీర్లు పెరిగారని, బీజింగ్‌లో 18 మంది తగ్గారని రిపోర్ట్ ద్వారా తేలింది. ముంబైలోని బిలియనీర్లందరి సంపద కలిపి రూ.37 లక్షల కోట్లు. బీజింగ్ బిలియనీర్ల మొత్తం సంపద దాదాపు రూ.22 లక్షల కోట్లు. పవర్, ఫార్మాస్యూటికల్స్, ముఖేష్ అంబానీ వంటి బిలియనీర్లు ఈ రంగాల నుండి గణనీయంగా లాభపడటంతో ముంబైలో సంపన్నుల సంపద పెరిగిందని రిపోర్టు తేల్చింది.