మై హోమ్ సంస్థకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని వంద ఎకరాలకు పైగా భూదాన్ భూములను కబ్జా చేసి సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు చేశారని పేర్కొంది. ఆ భూములను ఖాళీ చేయాలని మై హోమ్‌తో పాటు కీర్తి ఇండస్ట్రీస్, మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. కాగా, భూదాన్ భూములను వ్యవసాయానికి మాత్రమే వాడాలని నిబంధన ఉంది.
బీఆర్ఎస్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన మైహోం సంస్థ పెద్దలు అటు ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు ఇటు జంటనగరాల్లో పలు ఆక్రమణలకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం భూదాన్ భూములకు సంబంధించి నోటీసులు జారీ చేయడం ఆసక్తికరంగా మారింది.
హుజూర్ నగర్ మెళ్ల చెరువు గ్రామ పంచాయితీ పరిధిలో భూదాన్ భూమి ఆక్రమించుకుని సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించారని మై హోమ్ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. 113 ఎకరాలు మై హోమ్, 18 ఎకరాలు కీర్తి సిమెంట్స్, 21.5 ఎకరాలు కీర్తి సిమెంట్ ఎండి పేరుతో పాటు.. మరో ఇద్దరు రైతుల పేరుమీద 3 ఎకరాలు ఆక్రమణకు గురైందని నోటీసులు జారీ చేశారు. దీనిపై ఈనెల 16న CCLA కు హాజరు కావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సర్వే నెంబర్ 1057లోని 160 ఎకరాల్లో.. 150 ఎకరాల భూదాన్ భూములు ఆక్రమణ గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది.