పాయింట్ బ్లాంక్, వెబ్డెస్క్: ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు మొదటి రోజే పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాట మేరకు తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైలుపై పెట్టారు. ఈ మేరకు ఏడాది డిసెంబరు 31లోగా డీఎస్సీ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని గురువారం రాత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ జీవో జారీ చేశారు. అయితే, మొత్తం పోస్టులు 16,347 కాగా, అందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్‌జీటీ) పోస్టులు 6,371, పీఈటీ పోస్టులు 132, స్కూల్ అసిస్టెంట్స్ పోస్టులు 7,725, టీజీటీ పోస్టులు 1,781, పీజీటీ పోస్టులు 286, ప్రిన్సిపల్ పోస్టులు: 52 ఉన్నాయి. డీఎస్సీ ప్రకటన నుంచి పోస్టుల భర్తీకి మొత్తం పనులను 6 నెలల్లోపే పూర్తి చేయనున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్, దరఖాస్తు, పరీక్ష తేదీలు వివరాలు వెల్లడి కానున్నాయి. కాగా, 2024 ఎన్నికల ముందు 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గత ప్రభుత్వం ప్రకటన ఇవ్వగా 4,72,487 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడంతో మెగా డీఎస్సీ వాయిదా పడింది.