పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్ : ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా.. నేటితో నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తయింది. గురువారం 3 గంటలకు నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా.., 4,210 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలోని 25 లోక్సభ స్థానాలకు 731 మంది అభ్యర్థుల నుంచి నామినేషన్లు అందాయి. కాగా, రేపు (ఏప్రిల్ 26) నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 29 వరకు అవకాశం ఉంది. దేశంలో ఈసారి సార్వత్రిక ఎన్నికలను 7 దశల్లో నిర్వహిస్తుండడం తెలిసిందే. నాలుగో దశలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్సభకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ 1న ఏడో విడత పోలింగ్ జరగనుండగా.., జూన్ 4న దేశవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరపనున్నారు.