Pithapuram: మరోసారి వివాదంలో పిఠాపురం

0
8

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఎన్నికల ముందు పిఠాపురంలో ఎంతగా వార్తల్లో నిలిచిందో.. అంతే ఎలక్షన్ అయ్యాక కూడా ఆ నియోజకవర్గం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అంతే హాట్ టాపిక్‌గా మారింది. పొత్తు ధర్మాన్ని పాటించి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీలోకి దిగారు. అనంతరం అక్కడ సంస్థాగతంగా బలంగా ఉన్న టీడీపీ నేత వర్మ సహకారంతో పవన్, వైసీపీ అభ్యర్థి వంగా గీతపై అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. కానీ, ప్రస్తుతం నియోజకవర్గంలో సీన్ రివర్స్ అవుతోంది. అక్కడ టీడీపీ, జనసేన నాయకుల మధ్య నివురుగప్పిన నిప్పులా మారాయి. అది ఎప్పుడు, ఎక్కడ బద్దలవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

తాజాగా, పిఠాపురం పరిధిలోని తాటిపర్తి ఆలయ బాధ్యతలపై రెండు పార్టీల నడుమ పోరు రణరంగాన్ని తలపిస్తోంది. గుడిపై సర్వ హక్కుల తమకే ఉన్నాయంటూ రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. అదేవిధంగా తాజాగా మరో ఘటన రెండు పార్టీల మధ్య వైరాన్ని బహిర్గతం చేసింది. పిఠాపురం పాదగాయ సమీపంలో ఏర్పాటు చేసిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జనసేన పార్టీ ఫ్లెక్సీలను సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు చించేవేశారు. కనీసం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయకముందే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఏ పరిస్థితులకు దారి తీస్తుందోనని ఇరు పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.