పాయింట్ బ్లాంక్, వెబ్డెస్క్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్థం హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో ఉంచారు. దీంతో రామోజీరావు పార్థీవదేహాన్ని రాజకీయ, సినీ, టీవీ ప్రముఖులు సందర్శిస్తున్నారు. అటు రామోజీరావు పార్థివదేహానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత రాధాకృష్ణ (చినబాబు) నివాళులర్పించారు. రామోజీరావుతో తనకు అనుబంధాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. అనంతరం రామోజీ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రామోజీరావు మరణం తీరని లోటని.., ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను సూచించారు జనసేన నేత పవన్ కళ్యాణ్.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రామోజీరావును ప్రమాణస్వీకారం తర్వాత వచ్చి కలుద్దామ అనుకున్నానని.., ఈలోపే ఇలా జరిగిందని పవన్ ఎమోషనల్ అయ్యారు. రామోజీరావును జగన్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని.., ఇప్పుడు అది లేదని పవన్ కళ్యాణ్ చెప్పారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు దేవుడు అండగా నిలవాలన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. ఏపీ, తెలంగాణలో వేలాది మంది జర్నలిస్టులను రామోజీరావు అందించారని గుర్తు చేశారు. రామోజీరావు మరణంపై జనసేన తరపున సంతాపం తెలియజేస్తున్నానని పవన్ తెలిపారు.