పాయింట్ బ్లాంక్, వెబ్డెస్క్: 2019 నుంచి 2024 వరకు ఏపీ నేల భయపడిపోయిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురంలో జరుగుతున్న వారాహి యాత్రలో ఆయన పాల్గొన్నారు. గత ఐదేళ్లలో అధికారులు, పోలీసులు సైతం వణికిపోయారని తెలిపారు. ఏపీలో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారని తెలిపారు. అసెంబ్లీలో జనసేన ఎలా అడుగుపెడుతుందో చూస్తామన్న గత ప్రభుత్వ మంత్రుల వ్యాఖ్యలను పిఠాపురం ప్రజలు సీరియస్ గా తీసుకున్నారని చెప్పారు. అసెంబ్లీ గేటు బద్దలు కొట్టుకునే వెళ్లే అవకాశం జనసేనకు ఇచ్చారని తెలిపారు. గ్రామ స్వరాజ్యం కోసం తాను పంచాయతీ రాజ్ శాఖ తీసుకున్నానని తెలిపారు. తనకు లంచాలు అవసరం లేదని.., కానీ కాంట్రాక్టర్లు కచ్చితంగా నీతిగా పని చేయాలని సూచించారు. ప్రజల సొమ్ముపై ప్రతీ పైసాపై లెక్క అడుగుతానని పవన్ తెలిపారు. ఎమ్మెల్యేగా ప్రజల ముందు ప్రమాణ స్వీకారం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి, అభ్యన్నతి కోసమే పని చేస్తానని, లంచాలు తీసుకోనని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు.