PawanKalyan: పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటా- డిప్యూటీ సీఎం పవన్

0
14

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన హాజరై మాట్లాడారు. మంత్రిగా కీలక శాఖల బాధ్యతలు తీసుకున్నా అని.. ఎక్కువ మాటలు చెప్పను.. ఎక్కువ పని చేస్తా అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే పెన్షన్లు తీసేస్తామని భయపెట్టారని గుర్తు చేశారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువ మొత్తం పెన్షన్ ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పెన్షన్ల పంపిణీతో పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్నా అన్నారు.

పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ముఖ్యమని.. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలన్నారు. గత ప్రభుత్వం పంచాయతీ రాజ్ నిధులు దారి మళ్లించిందన్నారు. మాజీ సీఎం జగన్ రూ.600 కోట్లతో రుషికొండలో ప్యాలెస్ కట్టారని.. అది గత వైసీపీ ప్రభుత్వ ప్రాధాన్యత అన్నారు. అదే రూ.600 కోట్లతో ఒక జిల్లాలో పూర్తిగా అభివృద్ధి జరిగేది అని తెలిపారు. ప్రతీ శాఖలో పారదర్శకత, జవాబుదారీ తనం తీసుకొస్తా అన్నారు. తప్పు చేస్తే తననయినా ప్రశ్నించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఓటు వేయకపోయినా ఏ పార్టీ వారైనా ప్రశ్నించవచ్చన్నారు. హంగులకు, ఆర్భాటాలకు తాను వెళ్లనని పవన్ అన్నారు. అవినీతి చేయనని ప్రజలకు మాట ఇస్తున్నా అన్నారు. డబ్బు వెనకేసుకోవాలని ఎప్పుడూ ఆలోచించనని తెలిపారు. పిఠాపురంలో 620 గ్రామ సచివాలయాలు ఉన్నాయని.. ప్రతి సెక్రటేరియట్‌లో 10 మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. గతంలో 4 రోజులు ఇచ్చే పెన్షన్ ఒక రోజులో ఇస్తున్నామన్నారు. వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆగిపోతాయని భయపెట్టారని.. వాలంటీర్లు లేకపోతే పెన్షన్ పంపిణీ ఎక్కడ ఆగిందన్నారు పవన్ కళ్యాణ్.