AP News: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పండుగ.

0
27

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా నేడే పింఛన్ల పంపిణీ పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జూలై 1న ఉ. 6 గంటలకు ఎన్టీఆర్ భరోసా పేరుతో ఇంటి దగ్గరే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెనమాక గ్రామంలో ప్రారంభించారు. ఈ మేరకు ఎస్టీ కాలనీలోని పాముల నాయక్ ఇంటి వెళ్లి పెంచిన పింఛన్, బకాయిలతో కలిపి రూ. 7 వేలను స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది లబ్ధిదారులకు రూ. 4,408 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. సీఎం వెంట మంత్రి నారా లోకేష్, పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. ఈ క్రమంలో ఇవాళే 90 శాతం పెన్షన్ పంపిణీ చేసేలా అధికారుల ప్లాన్ చేశారు. అదేవిధంగా పింఛన్ పంపిణీలో పాల్గొనాలంటూ ప్రజాప్రతినిధులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో ఇలా ఆనందంగా మాట్లాడుకున్న రోజు లేదని.. నిద్రలేస్తే టెన్షన్, ఎవరు ఎప్పుడొస్తారో తెలిసేది కాదని ఆరోపించారు. మాజీ సీఎం జగన్ పాలనలో ఏపీ బ్రాండ ఇమేజ్ పూర్తిగా దెబ్బతిన్నదని.. ఎలాంటి వారు సీఎంగా ఉండాలో నిరూపించాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. అబద్ధాలకోరును శాశ్వతంగా రాజకీయాల్లో భూ సమాధి చేస్తామని అన్నారు. తాము ప్రజలకు సేవకులుగా ఉంటామే తప్పా.. పెత్తందారులుగా ఉండబోమని అన్నారు. ఎన్టీఆర్ హయాంలో రూ. 35తో మొదలైన పింఛన్లు రూ. 4 వేలకు చేరిందని అన్నారు. ఇప్పుడు ఇస్తున్న రూ. 4వేల పింఛన్లలో తన హయాంలో రూ. 2,840 పెరిగిందని గుర్తు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలన రాష్ట్ర ప్రజలకు ఏ పీడకల అని ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచి పేదరికం లేని సమాజాన్ని రూపొందిచాలన్నదే తమ ఆశయమని అన్నారు. 26 రోజుల్లో బకాయిలతో సహా పింఛన్ అందించామని అన్నారు. సంక్షేమంలో ఇది కేవలం మొదటి అడుగు మాత్రమేనని చంద్రబాబు అన్నారు.