MLC Kavitha:కవిత బెయిల్‌ వెనుక.. పాత్రధారులెవరు.. సూత్రధారులెవరు..?

0
47
MLC Kavitha
MLC Kavitha
దేశంలో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టైన ఎమ్మెల్సీ కవిత ఐదు నెలల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పేరు బయటకు రావడం మొదలు.. ఆమె బెయిల్‌పై తీహర్ జైలు నుంచి విడుదల వరకు ప్రతి విషయంలో రాజకీయం కనిపించింది. కవిత మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కావడమే దీనికి ప్రధాన కారణం. కవిత అరెస్ట్ మొదలు బెయిల్‌పై విడుదల వరకు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మొదలు లోక్‌సభ ఎన్నికల వరకు కవిత అంశం చర్చకు వస్తూనే ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేయడంతో.. కాంగ్రెస్ బీజేపీని టార్గెట్ చేసింది. బీఆర్‌ఎస్‌తో లోపాయికారీ పొత్తు కారణంగానే.. కవితను అరెస్ట్ చేయడంలేదని.. లిక్కర్ స్కామ్‌లో కవితను కేంద్రప్రభుత్వం కాపాడుతోందని హస్తం పార్టీ ప్రచారం చేసింది. ఆ సమయంలో బీజేపీలో జరిగిన సంస్థాగత మార్పులు.. కాంగ్రెస్ ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటేనన్న భావనను ప్రజల్లో కలగజేయడంలో కాంగ్రెస్ విజయవంతమైందనే విషయాన్ని ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. లోకసభ ఎన్నికలకు ముందు ఈడీ ఎమ్మెల్సీ కవితను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసింది. దీంతో కవితను బీజేపీ కాపాడుతుందంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడింది. ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే ముందస్తు ఒప్పందంలో భాగంగా కవితను అరెస్ట్ చేశారని.. ఇదొక డ్రామా అంటూ కాంగ్రెస్ కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. మరోవైపు బీజేపీ మాత్రం కవిత అరెస్ట్ విషయంలో సైలెంట్ అయిపోయింది. దర్యాప్తు సంస్థలు చేసే పనితో పార్టీకి సంబంధం లేదని బీజేపీ చెప్పుకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ కొంత బలహీనపడుతూ వచ్చింది. కవిత అరెస్ట్‌ తర్వాత బీఆర్‌ఎస్‌పై కొంత వ్యతిరేకత ప్రజల్లో వ్యక్తమైంది. వెరసి లోక్‌సభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. కాంగ్రెస్, బీజేపీ చెరో ఎనిమిదిలోక్‌సభ స్థానాల్లో విజయం సాధించింది. కవిత అంశంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లాభపడితే.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ లాభపడింది. రెండు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నష్టపోయింది.

బెయిల్ చుట్టూ రాజకీయం..

సార్వత్రిక ఎన్నికల తర్వాత కవిత బెయిల్ చుట్టూ రాజకీయం మొదలైంది. 2024 మార్చిలో కవిత అరెస్ట్ కాగా.. ఆగష్టు 26వరకు ఆమెకు బెయిల్ రాలేదు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కవితకు బెయిల్ వచ్చేస్తుందంటూ పెద్దఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేసేందుకు ఒప్పందం జరిగింది.. త్వరలోనే బెయిల్ అంటూ కాంగ్రెస్ రెండు నెలలుగా ప్రచారం చేస్తోంది. చివరకు ట్రయల్ కోర్టు, హైకోర్టు కవిత బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు మెరిట్స్‌లోకి వెళ్లకుండా.. కేసు స్థితి గతులను గమనించిన న్యాయస్థానం ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. బీజేపీ చలవతోనే కవితకు బెయిల్ అంటూ కాంగ్రెస్ మరో ప్రచారాన్ని ప్రారంభించగా.. కాంగ్రెస్ న్యాయవాదుల కృషి ఫలితంగా కవితకు బెయిల్ వచ్చిందంటూ బీజేపీ కౌంటర్‌ ఎటాక్ ప్రారంభించింది. అరెస్ట్ నుంచి బెయిల్ వరకు రాజకీయంగా ఎవరు ఎన్ని విమర్శలు చేసుకున్నా.. అంతిమంగా న్యాయస్థానం తీర్పును గౌరవించాల్సిందే. ఈడీ, కవిత తరపు న్యాయవాదుల వాదనలు విన్న తర్వాత భారత సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కవితకు బెయిల్ వచ్చిందంటే ఆ క్రెడిట్ ఆమె తరపు లాయర్లకు ఇవ్వాల్సిందే. సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహాత్గీ కవిత తరపున వాదించారు.

బెయిల్‌కు కారణాలు..

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు విచారణ పూర్తై.. ఛార్జిషీటు దాఖలు చేయడంతో నిందితులకు బెయిల్ ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. మరోవైపు కవిత మహిళ కావడంతో పాటు.. ఐదు నెలలుగా జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న కారణంగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ నిరాకరించడానికి సరైన కారణాలు, ఆధారాలు చూపించకపోవడంతోనే బెయిల్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈడీ తరపున కేంద్రప్రభుత్వం నియమించిన న్యాయవాదులు వాదనలు వినిపించారు. కవితకు బెయిల్ రాకుండా ఉండేందుకు ఈడీ న్యాయవాదులు ఆధారాలు చూపించకపోవడంతో బెయిల్ వచ్చినట్లైతే.. కాంగ్రెస్ తాజాగా చేస్తున్న ప్రచారంలో కొంత వాస్తవం ఉండొచ్చు. ఆధారాలు చూపించినా.. న్యాయస్థానం సంతృప్తి చెందకపోయి ఉండటం వలన బెయిల్ వచ్చి ఉండొచ్చు. ఏది ఏమైనా కవిత బెయిల్‌పై బయటకు వచ్చారు. ఇక తెలంగాణలో రాజకీయ సమీకరణలు ఎలా మారబోతున్నాయనేది వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest News Click Here