Ponnam Prabhakar: నేటి నుంచి టీజీ రిజిస్ట్రేషన్లు.. 0001తో స్టార్ట్

0
25

తెలంగాణ లో నేటి నుండి రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి వాహనాలకు టీజీ అని రిజిస్ట్రేషన్ కానుంది. మార్చి 15 నుండి 0001తో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో వాహనాలకు శుక్రవారం నుంచి టీజీ రిజిస్ట్రేషన్‌ జారీ కానున్న నేపథ్యంలో ఇకపై మూడు సిరీస్‌లతో తెలంగాణ వాహనాలు కనిపించనున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 1,68,91,666 వాహనాలు ఉన్నాయి. వీటిల్లో 70,81,345 వాహనాలు ఏపీ సిరీస్‌తో ఉండగా, 98,10,321 వాహనాలు టీఎస్‌ సిరీస్‌తో నడుస్తున్నాయి. రాష్ట్ర సిరీస్‌ తప్ప జిల్లా సిరీస్‌లు యధాతథంగా కొనసాగుతాయి. టీజీ జెడ్‌ ఆర్టీసీ వాహనాలకు, టీజీ09 పీ పోలీసు వాహనాలకు, నంబర్ల పక్కన టీ, యూ, వీ, డబ్ల్యూ, ఎక్స్, వై సిరీస్‌లు రవాణా వాహనాలకు కొనసాగుతాయి.

టీజీ అన్న పదంలో తెలంగాణ ఆత్మగౌరవం ఉందని.. ఉద్యమం టైమ్​లో ఏపీ పేరుతో ఉన్న బండ్ల నెంబర్ ప్లేట్లన్ని టీజీగా మార్చుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కిందని విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత టీజీ పేరుతో కేంద్ర ప్రభుత్వం జూన్ 2న గెజిట్ ఇస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం టీజీని టీఎస్ గా మార్చిందన్నారు.. టీజీని విమర్శించే వాళ్లు ముందు టీఎస్ ఎందుకు పెట్టారో చెప్పాలని, ఆతర్వాత తాము టీజీ ఎందుకు మారిందో చెబుతామన్నారు.