Rahul Gandhi: వాయనాడ్‎ను వదులుకున్న రాహుల్ గాంధీ.. అక్కడ నుంచి ప్రియాంక గాంధీ పోటీ

0
24

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఐదేళ్ల కిందట లోక్‎సభ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి కేవలం వాయనాడ్‎లో మాత్రమే నెగ్గిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. 2024 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఘనవిజయం సాధించారు. వాయనాడ్‎తో పాటు రాయ్‎బరేలీలోనూ రాహుల్ గెలుపును సాధించారు. అయితే ఈ రెండింటిలో ఏ స్థానాన్ని వదులుకోవాలన్నది ఆయనకు పెద్ద సమస్యగా మారింది. 2019లో ఎదురుగాలిలోనూ తనను ఎంతో ఆదరించి అక్కున్న చేర్చకున్న వాయనాడ్ నియోజకవర్గం ఒకవైపు.. పోయిన ప్రాభవాన్ని ఈసారి ఎన్నికల్లో తిరిగి అందించిన రాయ్‎బరేలీ మరోవైపు.. రాహుల్‎ను సందిగ్ధంలో పడేశాయి. తీవ్రంగా ఆలోచించిన మీదట ఆయన కేరళలోని వాయనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించారు. వాయనాడ్ నుంచి రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ బరిలో దిగడం ఖరారైంది.

అయితే దీనిపై రాహుల్ స్పందిస్తూ.. వాయనాడ్‎ను వదులుకోవాలా, రాయ్‎బరేలీని వదులుకోవాలా? అనే అంశంలో తీవ్రంగా మథనపడ్డానని వెల్లడించారు. వాయనాడ్ ఎప్పటికీ తన హృదయానికి దగ్గరగా ఉంటుందని, ఇకమీదట వాయనాడ్‎కు తరచుగా వస్తుంటానని తెలిపారు. కాగా, రాహుల్ వాయనాడ్‎ను వదులుకుంటున్న విషయాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఏఐసీసీ సమావేశంలో చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.