హైదరాబాద్ శ్రీరామనవమికి బీజేపీ ఏర్పాట్లు భారీగా చేస్తోంది. రామనవమి శోభాయాత్ర ధూల్‌పేట నుంచి ప్రారంభం కానుంది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రామనవమి శోభా యాత్రకు నాయకత్వం వహించనున్నారు. ఏప్రిల్ 17 బుధవారం ఉదయం 10 గంటలకు యాత్ర ప్రారంభమవుతుందని రాజాసింగ్ సోషల్ మీడియాలో తెలిపారు. హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌లోని ఆకాశపురి హనుమాన్ ఆలయం నుంచి యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు రాజాసింగ్.
గతేడాది మార్చి 30న విస్తృతమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఊరేగింపును పర్యవేక్షించడానికి సుమారు 1,500 మంది పోలీసులను మోహరించారు, సున్నిత ప్రదేశాలలో పోలీసు పికెట్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కూడా హైదరాబాద్‌లో జరిగే రామనవమి శోభా యాత్రకు కూడా అదే తరహాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు.
మరోవైపు.. హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జిగా రాజా సింగ్ నియమితులయ్యారు. జనవరి నుంచి హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా బాధ్యతలు చూస్తున్నారాయన. హైదరాబాద్ నియోజకవర్గ సిట్టింగ్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీని ఓడించేందుకు బీజేపీతో కలిసి ఎత్తులు వేస్తున్నారు. మాధవీలతను ఈసారి ఎలాగైనా గెలిపించుకోవాలని బీజేపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.