TG Politics: పంట నష్టం అంచనా.. నల్గొండలో కేసీఆర్ పర్యటన

0
22

తెలంగాణలో పంట నష్టాన్ని పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. వచ్చే నెల మొదటివారంలో ఆయన నల్గొండ, భువనగిరి, ఆలేరులో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్‌ను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. రైతులతో ముచ్చటించి వారి ఇబ్బందుల్ని కేసీఆర్ స్వయంగా తెలుసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు పడిపోతుండడంతో పంటపొలాలు, పండ్ల తోటలను కాపాడుకునేందుకు రైతులు బోర్లు వేయడం, బావుల్లో పూడికలు తీస్తున్నారని, అయినప్పటికీ నీళ్లు రాకపోవడంతో రైతులు నష్టపోతున్నారని నల్గొండ జిల్లా నేతలు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. గడిచిన పది సంవత్సరాలలో ఎండిపోని పంట పొలాలు, ఇప్పుడే ఎందుకు ఎండిపోయాయని ఇప్పటికే కేసీఆర్ ఆరా తీశారు. దీంతో పంటల పరిశీలనకు స్వయంగా తానే వస్తానని నేతలకు కేసీఆర్ చెప్పారు.

ఇదిలా ఉండగా.. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు అన్ని జిల్లాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు తమ పరిధిలోని గ్రామాల్లో జరిగిన పంట నష్టం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రస్తుతం పంటల పరిస్థితిని పరిశీలించాలని కేసీఆర్‌ రెండురోజుల కిందట సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి నివేదికల రూపంలో పంపాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయా నియోజకవర్గాల పరిధిలో బీఆర్‌ఎస్‌ నేతలు గ్రామాల్లో పంటల పరిస్థితిని పరిశీలిస్తున్నారు.