పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలపై ట్రోలింగ్ విపరీతంగా కొనసాగుతోంది. ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబును, పవన్ కళ్యాణ్‌ను ఇష్టమొచ్చినట్లు తిట్టిన వీడియోలు పెట్టి రెండు పార్టీల అభిమానులు వాటికి కౌంటర్‌గా వీడియోలు, ఫొటోలు ఎడిట్ చేసి ఫ్యాన్ పార్టీపై ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తున్నారు. తాజాగా, ‘కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి, ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ల దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి.. కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటకు రావాలి’.. అంటూ టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పేరిట గుంటూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. ప్రస్తుతం ఈ ఫ్లెక్సీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.