తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలే అవకాశం ఉంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. టికెట్ కేటాయింపుపై అధిష్ఠానం నుంచి క్లారిటీ లేకపోవడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీనికితోడు అనూహ్యంగా బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ గొడం నగేశ్ బీజేపీలో చేరడంతో డైలమాలో పడిన బాపురావు కాంగ్రెస్ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది.
త్వరలోనే ఆయన కాంగ్రెస్‌లో చేరే అవకాశమున్నట్లు సమాచారం. తాజాగా అమిత్ షా మీటింగ్‌కు ఆయన హాజరుకాకపోవడం ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఆదివాసీల్లో బలమైన నేతగా సోయంకు గుర్తింపు ఉంది. ఒకవేళ బీజేపీ సోయంకు బదులు ఆదివాసీ తెగకే చెందిన నగేశ్‌కు టికెట్ ఇస్తే కాంగ్రెస్ కూడా అదే వ్యూహంతో సోయంను బరిలోకి దించే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు లేకపోవడం ఆయనకు కలిసివచ్చే అంశం. కాగా ఇటీవల బీజేపీపై సోయం సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా కొంతమంది కుట్రలు పన్నుతున్నారని, తొలి జాబితాలో తన పేరు లేకపోవడానికి వారే కారణమని ఆరోపించారు. ఆదివాసీ నేతనైన తనకు టికెట్ దక్కితే మరోసారి గెలుస్తాననే భయంతో పార్టీలో కొందరు నేతలు భయపడుతున్నారని చెప్పారు