Supreme Court: నేడు కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

0
12

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు నేడు విచారించనుంది. 105 పేజీలతో కూడిన రిట్ పిటిషన్‌తో పాటు మహిళలను ఈడీ ఆఫీసుకు విచారణకు పిలవవచ్చా? అనే అంశంపై ఆమె దాఖలు చేసిన మరో పిటిషన్ కూడా బెంచ్ ముందుకు రానుంది. ఈ రెండు పిటిషన్లపై కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అటు ఇవాళ మూడో రోజు ఈడీ ఆమెను పలు అంశాలపై ప్రశ్నించనుంది.

ఢిల్లీ లిక్కర్​ స్కామ్​ వ్యవహారంలో ఆమ్​ ఆద్మీ పార్టీ నేతలకు కవిత ద్వారా రూ. 100 కోట్ల ముడుపులు అందినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో ఆప్ అగ్రనేతలు అరవింద్​ కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్ర పన్నారని పేర్కొంది. చెల్లించిన ముడుపులకు బదులుగా భారీ మొత్తంలో లబ్ధిపొందాలని ప్లాన్​ వేశారని తెలిపింది.

లిక్కర్​ స్కామ్​ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, హైదరా బాద్, చెన్నై, ముంబై సహా దేశవ్యాప్తంగా 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ తెలిపింది. ఆప్ కు చెందిన మనీశ్​ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ తో పాటు మొత్తం 15 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. రూ. 128.79 కోట్లు సీజ్ చేశామని స్పష్టం చేసింది. ఈ కేసులో ఒక ప్రాసిక్యూషన్(నేరారోపణ), 5 సప్లమెంటరీ కంప్లైట్స్ ను దాఖలు చేసినట్లు ఈడీ పేర్కొంది. ఈ కేసులో ఇంకా తదుపరి విచారణ కొనసాగుతున్నదని తెలిపింది.