తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందర్ రాజన్ తిరిగి బీజేపీలో చేరారు. మార్చి20వ తేదీన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో కషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా తమిళిసైని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కిషన్‌రెడ్డి. ఈ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పాల్గొన్నారు. కాగా రెండు రోజుల క్రితం తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా చేయగా ఆమె రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. గవర్నర్ గా తమిళిసై 2019 సెప్టెంబర్ 8న బాధ్యతలు చేపట్టగా.. 4 ఏండ్ల 6 నెలల 10 రోజుల పాటు పనిచేశారు.
కాగా లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నందున తమిళిసై రాజీనామా చేశారు. తమిళనాడు లోని కన్యాకుమారి లేదా తిరునల్వేలి లేదా చెన్నై సౌత్ లేదా పుదుచ్చేరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. బీజేపీ సైతం మెజారిటీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. త్వరలో పెండింగ్ లో ఉన్న సీట్లకు క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉన్నందున , రాజీనామాకు బీజేపీ హై కమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోనే తమిళిసై పదవి నుంచి వైదొలిగినట్టు సమాచారం.
మరోవైపు తెలంగాణ ఇంచార్జి గవర్నర్ గా సీపీ రాధకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2024 మార్చి 20వ తేదీ ఉదయం11:15 నిమిషాలకు రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదె ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.