తెనాలికి చెందిన గీతాంజలి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. తాజాగా టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త పసుమర్తి రాంబాబును అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. విజయవాడ సింగ్ నగర్‌లో అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు సమాచారం. గురువారం ఉదయాన్నే ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు తమతో రావాలని కోరారు.
అయితే తనకు ముందుగా నోటీసులు ఇవ్వనిదే తాను రానంటూ రాంబాబు పంతం పట్టారు. నోటీసులు లేకుండా తనను పోలీసులు విచారణకు తీసుకెళ్తున్నారని రాంబాబు ఈ ఉ.6 గంటలకు ట్వీట్ చేశారు. రాంబాబు కూతురు సైతం పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కాగా రాంబాబు గీతాంజలిపై అసభ్యకర కామెంట్స్ చేశాడని వైసీపీ ట్వీట్ చేసింది. రాంబాబు టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావుకు అనుచరుడిగా తెలుస్తోంది.
జగనన్న పాలనలో తనకు మంచి జరిగిందంటూ ఇంటి పట్టా అందుకున్న ఆనందంలో గీతాంజలి ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూలో భావోద్వేగానికి లోనైంది. అయితే ఆ వీడియోను ఉద్దేశపూర్వకంగా సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి.. ఆమెను అతిదారుణంగా ట్రోల్ చేశారు. దీంతో.. తీవ్ర మనోవేదనకు గురైన ఆమె రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే గాయాలతో ఉన్న ఆమెను ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.