Lok Sabha Election 2024: క్యాడర్ ఢీలా .. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరు ?

0
23

కరీంనగర్ లోక్‌సభ స్థానానికి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు, తీన్మార్ మల్లన్న పేర్లను కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈనెల 31న CEC భేటీలో దీనిపై స్పష్టత రానుంది. నియోజకవర్గ నేతల అభిప్రాయాలు, సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని.. సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేస్తారని సమాచారం.

మల్లన్న నాన్‌లోకల్ అభ్యర్థి కావడంతో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని పలువురు సూచిస్తున్నారట. అభ్యర్థి ప్రకటన ఆలస్యంతో క్యాడర్ ఢీలా పడిపోయింది. కరీంనగర్ లోక్‌‌‌‌సభ స్థానం నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ మరోసారి బరిలో నిలుస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యే పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని మార్చాలంటూ మొదలైన దుమారం సద్దుమణగడం లేదు. పార్టీకి చెందిన మాదిగ సామాజికవర్గ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, సంఘాల నేతలు ఆందోళనలు చేస్తున్నారు. పెద్దపల్లి అభ్యర్థిగా మాజీ ఎంపీ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ తనయుడు గడ్డం వంశీకృష్ణ పేరును ప్రకటించింది. దీంతో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు భగ్గుమంటున్నారు.

నియోజకవర్గం ఏర్పాటైన నాటినుంచి మాదిగ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి ఆగం చంద్రశేఖర్‌కు మాత్రమే ఒకసారి టికెట్‌ ఇవ్వగా, మిగతా ఎన్నికల్లో మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్లకే ఇస్తున్నారని, వాళ్లంతా స్థానికేతరులేనని చెబుతున్నారు.