Telangana: నిప్పుల కుంపటి.. అవసరమైతే తప్ప బయటకు రాకండి

0
16

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోయాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో వేడిగాలులు వీస్తున్నట్లు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. అవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మేలని సూచిస్తున్నారు. ఉప్పల్‌లో 43.3, శేరిలింగంపల్లిలో 43.1, కుత్బుల్లాపూర్‌లో 43.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువగా వేడిగాలులు ఉండే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్‌, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 10 నుంచి 20 రోజులు వేడి గాలుల ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొంది.

పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో నేడు, రేపు వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రత అధికంగా నమోదైంది. నంద్యాల పాణ్యంలో గరిష్ఠంగా 43.7, కర్నూలు, నందికొట్కూరులో 43.3, గూడూరులో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.