తెలంగాణలో ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని HYD వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రాత్రి సమయంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. పలుచోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు ఆయా జిల్లాలతోపాటు మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
నిన్న పలు జిల్లాల్లో టెంపరేచర్లు కాస్త తగ్గాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత రెండు రోజులపాటు 43 డిగ్రీల టెంపరేచర్లు నమోదు కాగా.. నిన్న 42 డిగ్రీల వరకు రికార్డ్ అయ్యాయి. నల్గొండ జిల్లాలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, నిర్మల్ లో 42.3, వనపర్తిలో 42.2, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 41.8, కామారెడ్డి, నాగర్కర్నూల్ లో 41.7, మహబూబ్నగర్, రాజన్న సిరిసిల్లలో 41.4, భద్రాద్రి కొత్తగూడెం 41.3, సూర్యాపేటలో 41.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో 39 నుంచి 41 డిగ్రీల మధ్య టెంపరేచర్లు రికార్డు అయ్యాయి.