Telangana: జూలై 7 నుంచి 29 వరకు తెలంగాణ బోనాల పండుగ.

0
15

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడించేలా ఆషాఢ బోనాల పండుగ జరపాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. శనివారం జూబ్లిహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో మంత్రి ఆధ్వర్యంలో ఆషాఢ బోనాల జాతర సన్నాహక సమావేశం జరిగింది. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను జూలై 7 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో నెలకొన్న 3 వేలకు పైగా ఆలయాలకు బోనాల జాతర నిర్వహణ నిమిత్తం రూ. 25 కోట్ల నిధులను అందించాల్సిందిగా సీఎం రేవంత్‌రెడ్డిని కోరామని.., మరో రెండు మూడు రోజుల్లో ఈ నిధులు విడుదలవుతాయన్నారు. బోనాలు ముగిసేదాకా అన్ని శాఖలు అంతర్గత సమావేశాలతో పాటు.., ఇతర శాఖలతో సంప్రదింపులు జరుపుకుంటూ.., విజయవంతంగా జాతరను ముగించాలని అధికారులను ఆదేశించారు మంత్రి కొండా సురేఖ.

కాగా, సమావేశంలో మంత్రి సురేఖతో పాటు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. బోనాల జాతరకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తారని.., మహిళలకు ఉచిత బస్సు సదుపాయంతో ఈ సంఖ్య మరింత పెరగనున్నందున అదనపు బస్సులు కేటాయించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మంత్రి సురేఖ కోరారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండ చర్యలు చేపట్టాలని.., బస్ స్టాండ్‌లలో తాగునీరు, చిన్న పిల్లలకు ఆహారం, వైద్య సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని ఏనుగు అంబారీపై ఊరేగింపు నిమిత్తం కర్నాటక నుంచి ఏనుగు తీసుకువస్తున్నట్లు మంత్రి తెలిపారు. అగ్నిమాపక శాఖ వాలంటీర్లకు శిక్షణనిచ్చి ఆలయాల వద్ద సేవల్లో వినియోగించుకోవాలని సూచించారు. ఆయా ఆలయాల్లో జరిగే ఉత్సవాలతో కూడిన క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్నారు. ఆలయ కమిటీలతో త్వరలోనే మీటింగ్ నిర్వహించి జాతర ఏర్పాట్లను పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని సురేఖ స్పష్టం చేశారు.