సీఎం రేవంత్ రెడ్డికి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నికల ముందు ఆయన దూకుడుతో, మాటల తూటాలతో యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. రేవంతన్న అంటూ ముద్దుగా పిలుచుకుంటారు అభిమానులు. సీఎం అయ్యాక అదే హుందాతనాన్ని మెయింటేన్ చేస్తున్నారు. ఆరు గ్యారంటీల అమల్లో నాలుగు గ్యారంటీలు అమలు చేసి మరో రెండు గ్యారంటీల అమలుపై కసరత్తు చేస్తున్నారు.
ఈ క్రమంలో రేవంత్ అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తమ అభిమానం చాటుతున్నారు. ఇప్పటికే పలు సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ కు పాలాభిషేకాలు చేస్తున్నాయి. లేటెస్ట్ గా రాష్ట్ర రెడ్డి అభిమానుల సంఘం కీలక ప్రకటన చేసింది. సూర్యాపేట జిల్లాలోని చిట్యాల మండలం వనిపాకలలో సీఎం రేవంత్ రెడ్డికి గుడి నిర్మించనున్నట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి సంతోష్ తెలిపారు. మార్చి19న గుడి నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు. కనిపించని దేవుడి కంటే కనిపించే దేవుడు సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు. దేవుడిలా తమ కోరికలు తీరుస్తున్నారని కొనియాడారు.
గతంలో దివంగత తమిళనాడు మఖ్యమంత్రి జయలలితకు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుడి కట్టారు. అలాగే ఏపీ సీఎం జగన్ కు శ్రీకాళ హస్తిలో రెండు కోట్ల రూపాయలతో గుడి కట్టారు.