Aroori Ramesh: హన్మకొండలో హైడ్రామా.. ఆరూరి రమేష్ ను తీసుకెళ్లిన ఎర్రబెల్లి

0
9

హన్మకొండ జిల్లాలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఇంటి వద్ద పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. నిన్న హైదరాబాద్ లో కేంద్ర హోమంత్రి అమిత్ షాను కలిసిన ఆరూరి..ఇవాళ పార్టీకీ రాజీనామా చేసేందుకు సిద్దమై ప్రెస్ మీట్ పెట్టారు. ఈలోపు అక్కడికి చేరుకున్న ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి పార్టీలోని ఉండాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. మాజీ మంత్రి హరీశ్ రావు ఆరూరికి ఫోన్ చేసి పార్టీలోనే ఉండాలని కోరారు.

మరోవైపు అక్కడ ఉన్న బీఆర్ఎస్, బీజేపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో ఆరూరి రమేష్ ను తన ఇంటి నుంచి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య తీసుకెళ్లారు. దీంతో ఆరూరి అనుచరులు ఎర్రబెల్లి వాహనాన్ని అడ్డుకున్నారు. .నినాదాల మధ్యనే ఆరూరి రమేష్ ను బలవంతంగా హనుమకొండ నుంచి హరీశ్ రావు దగ్గరకు తీసుకెళ్ళారు ఎర్రబెల్లి.

2014, 2018 ఎన్నికల్లో బీఆర్‍ఎస్‍ నుంచి వర్ధన్నపేట ఎమ్మెల్యే గా గెలిచిన ఆరూరి రమేశ్‍ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‍ అభ్యర్థి కేఆర్‍ నాగరాజు చేతిలో ఓడిపోయారు. ఉమ్మడి వరంగల్​ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన ఎస్సీ నేతగా రమేశ్​కు గుర్తింపు ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్​ వరంగల్​ జిల్లా పార్టీ అధ్యక్షుడిగానూ కొనసాగుతున్నారు. ఓటమి తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ బలహీనపడుతుండటంతో పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు.