TG Politics:దమ్ముంటే మల్కాజిగిరి అభ్యర్థిని ప్రకటించు రేవంత్.. ఈటల సవాల్

0
11

సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిని ప్రకటించాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. మల్కాజిగిరిలో తనపై పోటీ చేయించేందుకు కాంగ్రెస్ డబ్బు ఉన్న అభ్యర్థి కోసం వెతుకుతోందని ఎద్దేవా చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు డబ్బు సంచులు, ధర్మానికి మధ్య జరిగే ఎన్నికలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నీటి బుడగ అని ఎద్దేవా చేశారు. అధికారం కోసం అలివికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కిందని మండి పడ్డారు.

ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతు రుణమాఫీ రూ.2లక్షలను ఎప్పటిలోగా చేస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఓడిపోవాలన్న కసితో ప్రజలు కాంగ్రెస్ ను గెలిపిస్తే సీఎం రేవంత్రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయని మండిపడ్డారు. తురుం ఖాన్ కేసీఆరే లక్ష రుణమాఫీ చేయలేదని, ఇక పిట్టల దొర లెక్క మాట్లాడే రేవంత్ రెడ్డి 2లక్షల రుణమాఫీ ఎలా చేస్తారని ప్రశ్నించారు.

కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చాక రైతులకు ఎరువు లు, విత్తనాల బాధపోయిందన్నారు. వ్యవసాయం చేసే వారికే రైతు బంధు ఇవ్వాలని నాడు మంత్రిగా తాను కేసీఆర్కు చెప్పినా పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిండు మనసుతో బీజేపీని దీవించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.