TG Politics: కాంగ్రెస్ లో చేరిన వెంటనే జితేందర్ రెడ్డికి కీలక పదవి.. ఉత్తర్వులు జారీ

0
18

బీజేపీ నేత జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జితేందర్ రెడ్డి మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీలో బలమైన సంబంధాలు ఉన్న జితేందర్‌ను పోటీకి దించితే కచ్చితంగా గెలుస్తారని రేవంత్ భావిస్తున్నట్లు టాక్. అయితే జితేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన వెంటనే తెలంగాణ ప్రభుత్వం ఆయనకు కేబినెట్ ర్యాంకు పదవి ఇచ్చింది.

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (క్రీడా వ్యవహారాలు) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం (మార్చి 15న) రాత్రి జారీ చేశారు. మల్లు రవి ఇటీవల ఆ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. దాంతో పార్టీలో చేరిన వెంటనే పాలమూరు జిల్లాకే చెందిన మరోనేత జితేందర్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం పదవి ఇచ్చింది.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానం నుంచి ఆశించారు జితేందర్ రెడ్డి. మొదటి నుంచి ఇక్కడ పోటీ చేయాలని జితేందర్‌ రెడ్డి ప్లాన్‌ చేసుకున్నారు. అయితే తాజాగా విడుదలైన జాబితాలో ఆయన పేరు లేదు. ఈ సీటుు మరో సీనియర్ మహిళా నాయకురాలు డీకే అరుణకు ఇచ్చింది. దీంతో జితేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు.