TG Politics: నాకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ మాటిచ్చింది: రాజగోపాల్ రెడ్డి

0
15

తనకు కేబినెట్ లో కీలక పదవి ఇస్తామని కాంగ్రెస్ మాటిచ్చిందన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎన్నికల్ కోడ్ వల్ల కేబినెట్ విస్తరణ చేయడం లేదన్నారు. ఆలస్యమైనా తనకు పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ఆదేశిస్తే భువనగిరి నుంచి తన భార్య లక్ష్మీ పోటీచేయడానికి సిద్ధమన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. తాము భువనగిరి ఎంపీ టికెట్ కు అప్లై చేసుకోలేదన్నారు. భువనగిరి ఎంపీ టికెట్ విషయంలో తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. సర్వేలు చేయించి గెలిచే అభ్యర్థులకు టికెట్‌ ఇవ్వాలని అధిష్ఠానానికి చెప్పామన్నారు.

భువనగిరి టికెట్ బీసీలకు ఇవ్వాలని ప్రతిపాదించానని చెప్పారు. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్‌ ఛైర్మన్‌గా లక్ష్మి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారన్నారు. కోమటిరెడ్డి లక్ష్మికి ఎంపీ టికెట్‌ ఇస్తే గెలిచే అవకాశం ఉన్నట్లుగా పార్టీలకు అతీతంగా ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు.

పార్టీ ఆదేశిస్తే 17 పార్లమెంట్ స్థానాల్లో ప్రచారం చేస్తానన్నారు రాజగోపాల్ రెడ్డి. భువనగిరి నుంచి ఎవరికీ టికెట్ ఇచ్చిన భారీ మెజారిటీ తో గెలిపిస్తామని చెప్పారు. తెలంగాణలో 12నుంచి 14 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందన్నారు. ఎన్నికల కోడ్ తో మంత్రి వర్గ విస్తరణ ఆగిపోయిందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ను విడదీయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రాణమున్నంత సేపు తాము కలిసే ఉంటామన్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ ను ఎవరూ విడదీయలేరని చెప్పారు. భవిష్యత్ లో బీఆర్ ఎస్ పార్టీ కనుమరుగవుతుందన్నారు. బీఆర్ఎస్ నుంచి వచ్చే వారికీ స్వాగతం పలుకుతున్నామన్నారు. మునుగోడును అన్ని కోణాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు