TG Politics: ప్రమాణం పూర్తి.. తెలంగాణకు వరుసగా మూడో తమిళ గవర్నర్

0
21

కీలకమైన ఎన్నికల సమయంలో తెలంగాణలో కొత్త గవర్నర్ కొలువయ్యారు. తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌ మార్చి 20 బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో హైకోర్టు చీఫ్‌ జస్టిస్ ఆలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. తమిళిసై సౌందర రాజన్ ఇటీవలే తన పదవికి రాజీనామా చేశారు. దీంతో జార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణ బాధ్యతను అదనంగా అప్పగించారు రాష్ట్రపతి.

మంగళవారం అర్థరాత్రి నగరానికి చేరుకున్న సీపీ రాధాకృష్ణ.. ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. పుదుచ్చేరి ఇన్‌ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా రాధాకృష్ణన్ అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. తనకు అదనపు బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి రాధాకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు. “అదనపు బాధ్యత అప్పగించినందుకు ధన్యవాదాలు” అని రాధాకృష్ణన్ ఎక్స్‌లో రాశారు. రాధాకృష్ణన్ కోయంబత్తూరు నుంచి బీజేపీ టికెట్‌పై రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన తమిళనాడులోని భారతీయ జనతా పార్టీకి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు.

ఈఎస్‌ఎల్‌ నరసింహన్, డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నియమించబడిన తమిళ మూలాలు కలిగిన మూడవ గవర్నర్ రాధాకృష్ణన్. డాక్టర్ సౌందరరాజన్ తర్వాత ఆ పదవిని నిర్వహించిన రెండో తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్ కూడా ఆయనే. తమిళిసై రాజీనామాను ఆమోదించిన తరువాత, డాక్టర్ సౌందరరాజన్ మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర, పుదుచ్చేరి ప్రజలకు సేవ చేయడానికి తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు ముర్ము, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు ధన్యవాదాలు తెలిపారు.