TG Politics: రైతుబంధు డబ్బులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

0
18

రైతుబంధు డబ్బుల జమపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ‘ఐదెకరాల భూమి ఉన్న రైతులకు ఇప్పటివరకు రైతుబంధు అందింది. మిగతా వారికి ఈ నెలాఖరులోగా సాయం అందిస్తామని చెప్పారు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులు 92 శాతం ఉన్నారని వాటికి రైతుబంధు జమ చేశామని, మిగతా 8 శాతం కూడా పూర్తి చేస్తామన్నారు.

రైతులకు రూ.2లక్షల రుణమాఫీ అమలుపై ఆర్బీఐతో పాటు బ్యాంకర్లతో చర్చిస్తున్నామని అన్నారు మంత్రి మంత్రి తుమ్మల . ఒకేసారి రుణమాఫీ చేసేలా విధివిధానాలు రూపొందిస్తున్నాం. వచ్చే పంట సీజన్ నుంచి వరిధాన్యానికి రూ.500 బోనస్ అందిస్తామని వెల్లడించారు. ఇక నుంచి పంట వేసిన వారికే పెట్టుబడి సాయం అందిస్తామని మంత్రి తుమ్మల స్పష్టంచేశారు. ప్రజల నుంచి ఇలాంటి విజ్ఞప్తులే వస్తున్నాయని, శాసనసభలో చర్చించి విధివిధానాలు రూపొందిస్తామని చెప్పారు.

ఈ ఏడాది చివరి నాటికి సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను వైరా రిజర్వాయర్‌కు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. తాగునీటి అవసరాల కోసం పాలేరు రిజర్వాయర్‌కు రెండు రోజుల్లో సాగర్‌జలాలు వస్తాయని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో చర్చించామని అన్నారు.