TG Politics: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావు పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు

0
22

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను కస్టడీకి అప్పగిస్తూ కింది కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని అతను హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.. దీనిపై ఇవాళ విచారించిన ధర్మాసనం ప్రణీత్ రావు పిటిషన్‌ను కొట్టివేసింది. కింది కోర్టు తీర్పును సమర్థించింది.

ప్రణీత్ రావు పిటిషన్ పై నిన్న హైకోర్టులో ఇరువర్గాలు వాదనలు వినిపించాయి. మీడియా కు ఎలాంటి లీకులు ఇవ్వడం లేదని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది. పోలీస్ అధికారులు మీడియా కు లీక్ లు ఇస్తారని చెప్పడం సరైంది కాదన్నారు. అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రణీత్ రావుపై కేసు నమోదు అయ్యిందని తెలిపారు. అడిషనల్ ఎస్పీ రమేష్ ఎక్కడ కూడా ఈ కేసులో జోక్యం చేసుకోలేదని చెప్పారు. ప్రణీత్ రావు బంధువులు అనుదీప్ అతని కౌన్సిల్ వాసుదేవన్ రోజు కలుస్తున్నారని తెలిపారు. కేసు దర్యాప్తు దశలో ఉండగా పిటిషన్ వేయడం కరెక్ట్ కాదన్నారు. ప్రణీత్ రావు వేసిన పిటిషన్ ను కొట్టివేయాలని న్యాయవాది వాదించారు. దీంతో నిన్న తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు ఇవాళ ప్రణీత్ రావు పిటిషన్ ను కొట్టివేసింది. కింది కోర్టు తీర్పును సమర్థించింది.

ప్రణీత్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురి ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో ప్రణీత్ రావును విధుల్లో నుంచి సస్పెండ్ చేసింది.