బీఆర్ఎస్ నూతన సెక్రటరీ జనరల్ గా తెలంగాణ తొలి సభాపతి, శాసనమండలి సభ్యుడు సిరికొండ మధుసూదనాచారి నియమితులయ్యే అవకాశం ఉంది. పార్టీ సెక్రటరీ జనరల్ ఉన్న రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావు (కేకే) బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ స్థానంలో మధుసూదనాచారిని పార్టీ అధినేత కేసీఆర్ నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మధుసూదనాచారి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొనడంతోపాటు బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కీలకంగా పని చేస్తున్నారు.
శాసనసభతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవసరమైన వ్యూహాలను రూపొందించడంలో మధుసూద నాచారి కీలక పాత్ర పోషించారు. పార్టీ అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల ప్రణాళికలను రూపొందించడంలోనూ ఆయన తన ముద్ర వేసుకున్నారు. పార్టీ కీలక నేతలతో చర్చించి సెక్రటరీ జనరల్ నియామక ప్రక్రియను పూర్తి చేయాలన్న తలంపుతో కేసీఆర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ నెల 30న కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకోవడంతో ఈ లోపే సెక్రటరీ జనరల్ కొత్త వారిని ఎంపిక చేయాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్టు చెబుతున్నారు. మధుసూదనా చారి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆయనను తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ గా పని చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నిమితులయ్యారు.