తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలన్న పట్టుదలతో ఆ పార్టీ అధినాయకత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వ్యూహం సిద్ధం చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీ, జనసేన పొత్తుతో తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీకి తెలుగుదేశం పార్టీ సమాయత్తం అయినట్టు చెబుతున్నారు. ఖమ్మం లోక్ సభ స్థానంలో బీజేపీ, జనసేన సహకారంతో పార్టీ తరపున అభ్యర్థిని నిలబెట్టాలన్న నిర్ణయానికి టీడీపీ వచ్చినట్టు సమాచారం. ఎన్డీయేలో టీడీపీ తిరిగి చేరిన విషయం తెలిసిందే.
ఖమ్మం జిల్లాలో టీడీపీ మంచి బలంగా ఉంది. రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తుపల్లి, అశ్వరావుపేట స్థానాల్లో టీడీపీ పాగా వేసింది. పార్టీ బలంగా ఉండడంతో పాటు ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఉన్న ఆరేడు నియోజకవర్గాల్లో టీడీపీ బలంగా ఉందని ఆ పార్టీ విశ్వసిస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఖమ్మం లోక్ సభ బరిలో ఉండాలన్న పట్టుదలతో టీడీపీ ఉన్నట్టు సమాచారం. త్వరలోనే ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.