ఎన్నికల వేల తెలంగాణ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వినతికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుండి ఫసల్ బీమా అమలు చేసే అవకాశం ఉంది. ఈ పథకం రైతులకు అనుకూలంగా లేదని బీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యతిరేకించగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధం అయ్యింది.
వచ్చే వానాకాలం నుంచి ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ, అనుమతి కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. దీనికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఆహార ధాన్యాల పంటలకు 2 శాతం, వాణిజ్య పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లిస్తే ఏదైనా నష్టం వచ్చినప్పుడు పరిహారం అందనుంది.
ఈ పథకం అమలు చేయాలంటే తక్షణమే పథకాన్ని అమలు చేసే కంపెనీలను టెండర్ల ద్వారా ఆహ్వానించాలి. దీనికి నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఇప్పుడు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ తప్పనిసరి. ఒకవేళ ఈసీ అనుమతి ఇవ్వకుంటే ఈ పథకం వచ్చే సీజన్ నుంచి అమలు అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని అంటున్నారు అధికారులు. ఈ స్కీంతో నష్టం వస్తుందన్న ఆందోళన నుంచి రైతులకు ఉపశమనం లభించనుంది.