ఎటు చూసినా బీఆర్ఎస్ నుంచి పోయే దారులే కనిపిస్తున్నాయి కానీ.. వచ్చే దారులు ఐతే కనిపించడంలేదు. గులాబీ బాస్ కేసీఆర్ కు పవర్ ఉన్నప్పుడే కింగ్ అనీ.. ఒక్కసారి పవర్ పోతే కుక్క కూడా ఆయన ముఖం చూడదని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. బీఆర్ఎస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు గంపగుత్తగా బయటకు వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.
కేకేను నెత్తిన పెట్టుకున్నారు కేసీఆర్. కాంగ్రెస్ నుంచి తెచ్చుకుని చాలా ప్రయారిటీ ఇచ్చి రాజ్యసభ సీట్లు ఇచ్చి.. కుమార్తెకు హైదరాబాద్ మేయర్ పదవి ఇస్తే.. ఇప్పుడు ప్రభుత్వం మారగానే.. మా సొంత పార్టీ కాంగ్రెస్ అంటూ చేరిపోయేందుకు రెడీ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. రాజకీయం అంటేనే అవకాశం అని.. సందర్భం.. స్థానిక పరిస్థితులకు తగ్గట్టు పార్టీలు మారుతారన్న ప్రచారం జరుగుతోంది.
దానం నాగేందర్ దగ్గర నుంచి ప్రకాష్ గౌడ్ వరకూ చాలామంది.. కేసీఆర్ భయంతోనో.. పనుల కోసమే అప్పట్లో బీఆర్ఎస్ లో చేరారని విశ్లేషకులు అంటున్నారు. ఇది బీఆర్ఎస్ బలంగా కంటే వాపుగా చూడాలన్నారు. కేసీఆర్ ఈ వలస లీడర్లతో ఎంత లాభపడ్డారో కష్టసమయంలో అంతకంటే ఎక్కువ తీవ్రంగా నష్టపోతున్నారు. కేసీఆర్ ఉద్యమకారులను కాదని.. వలస లీడర్లకు ప్రయారిటీ ఇవ్వడమే ఆయన చేసుకున్న తప్పని తెలంగాణ వాదులు అంటున్నారు. పాత టీడీపీ లీడర్లను చేర్చుకున్నప్పటికీ.. అదే పాత టీడీపీ లీడర్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి ఏకు మేకైపోతాడని కేసీఆర్ తో సహా ఎవరూ ఊహించి ఉండరు. అందుకే బీఆర్ఎస్ కు రానున్న రోజుల్లో సింగిల్ డిజిట్ ఎమ్మెల్యేలే మిగులుతారన్న చర్చ జరుగుతోంది.